Latest Articles

ఆ ‘ఇద్దరు’ పట్టుబడితే..జగన్ ?

ఆ ‘ఇద్దరు’ పట్టుబడితే..జగన్ ?

 

ఆర్సీ సింగ్‌ ?  ఎస్‌కె పాల్‌ ? ఈ ఇద్దరితో జగన్‌కు ఉన్న లింకేంటి ? సిబిఐ  వెతుకుతున్న డజను కంపెనీల్లో వీళ్ళ పాత్రేంటి? బెంగళూరు నుంచి వీరు నడిపిన లావాదేవీల లేంటి? వీరిద్దరు  పెట్టుబడులు పెట్టేందుకు జగన్ కంపెనీ  ’జగతి’నే ఎందుకు ఎంచుకున్నారు? వీరు పట్టుబడితే జగన్ పరిస్థితి ఏంటి ?

ప్రస్తుతం జగన్ ఆస్తులు  దర్యాప్తు చేస్తున్న సిబిఐ కి సవాల్ గా మారిన అంశం.  ఇందులో తవ్విన కొద్దీ అంతుబట్టని లావాదేవీలు బయటకు వస్తున్నాయి. దానికితోడు పెట్టుబడిన పెట్టిన ఇద్దరికి అంత సీన్ లేదని, వారు జగన్ కు బినామీలనీ, జగన్ కంపెనీలలో సాధారణ ఉద్యోగులని నిఘావర్గాల సమాచారంలో తేలుతున్నట్లు తెలుస్తోంది. జగన్ అడ్డదారిలో దోచిన సంపద వీరిద్వారా జగతిలోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగుళూరు కేంద్రంగా పెట్టుబడులు పెట్టిన 12 కంపెనీల పరిస్థితి అంతేనని సమాచారం.

జగతి పబ్లికేషన్స్‌ వ్యవహారంలో సిబిఐ ముందుగా ఆదాయం పన్ను పత్రాలను నిశితంగా పరిశీలించింది. ఈ క్రమంలో ఐటి విభాగం రెడ్‌ మార్క్‌ చేసిన ఓ అంశంపై  అధికారులకు అనుమానం వచ్చింది. 

2008 అక్టోబర్‌ 10వ తేదీ రికార్డుల ప్రకారం… మొత్తం 41 మంది జగతిలో వాటాదారులు. ఇందులో అతి పెద్ద వాటా కార్మెల్‌ ఆసియా హోల్డింగ్‌. దీనికి 88.3 శాతం వాటా ఉంది. దీంతో పాటు బెంగళూరు కేంద్రంగా పుట్టుకొచ్చిన కొన్ని కంపెనీలు కూడా జగన్‌ కంపెనీల్లో వాటా దారులయ్యాయి. వీటి లావాదేవీలు కళ్ళు బైర్లు గమ్మేలా ఉన్నాయి. ఒక్కో కంపెనీకి పదుల సంఖ్యలో పుట్టగొడుగు కంపెనీలు. అవి జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నట్టుగా రికార్డులు. ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల్లో కాంట్రాక్టులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో సంబంధాలున్నాయి.

వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు  కొన్ని కంపెనీలు హైదరాబాద్‌ చుట్టుపక్కల భూముల వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ చోటామోటా కంపెనీలు స్థానికంగా కొన్నింటితో కలిసి వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి  ఈ కంపెనీల లింక్‌లు అంతిమంగా జగన్‌కు సంబంధం ఉన్న కంపెనీలతో ముడివడినట్టు దర్యాప్తులో తేలుతోంది.  ఇంత చేసినా ఇవన్నీ లాభాల్లో ఉన్నాయా? అంటే అదీ లేదు. నష్టాల్లో ఉన్నాయి. అయినా కోట్లాది రూపాయల పెట్టుబడులు జగతిలో పెట్టాయి. ఇదే అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ఐటి అధికారులకూ అంతుబట్టడం లేదు. దీనిపై వివరణ కావాలని జగతికి గతంలోనే నోటీసులిచ్చినట్టు సమాచారం. ఇప్పటికీ వాటికి  సమాధానం రాలేదు.

బెంగళూరుకు చెందిన ఈ పన్నెండు కంపెనీల ఉమ్మడి వాటా 1.3 శాతం. జగతిలో ఈ కంపెనీలు వెచ్చించిన మొత్తం పెట్టుబడి ప్రీమియంతో కలిపి రూ.41.62 కోట్లు. జగతి పబ్లికేషన్స్‌ 2008లో ఆదాయం పన్ను శాఖకు సమర్పించిన వివరాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చిన కంపెనీల ఆర్థిక పురోగతి పడుతూ లేస్తూ ఉంది. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు 2007-08లో సమర్పించిన వివరాలు వీటిని రుజువు చేస్తున్నాయి.

దాదాపు అన్ని కంపెనీలకు నష్టాలే ఉన్నాయి. కానీ ఇవి మాత్రం జగన్‌ కంపెనీల్లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ఈ పన్నెండు కంపెనీల లావాదేవీలన్నీ ఇద్దరి చేతుల మీదుగానే జరిగాయి. కేవలం రెండు బ్యాంకుల్లోనే ఖాతాలున్నాయి. ఆర్‌సి సింగ్‌, ఎస్‌కె పాల్‌ ఇద్దరే కంపెనీల ఆర్‌వోసిలపై సంతకాలు పెట్టారు. ఇదెలా సాధ్యం? దాదాపు మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నడిపినట్టు రికార్డులున్నాయి. కానీ ఇద్దరే కథలో కన్పించడం అనుమానాస్పదంగా ఉందని ఆదాయం పన్నుశాఖ ఆక్షేపిం చింది. కోల్‌కతా బాలిగంజ్‌లోని సౌత్‌ ఇండియా బ్యాంక్‌ శాఖ, జోస్‌పార్క్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల్లో మాత్రమే 12 కంపెనీల లావాదేవీలున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా సిబిఐ కొన్ని వివరాలు సేకరించింది. బ్యాంక్‌ రికార్డులు, ఐటి పత్రాల వివరాలకు పొంతన లేదని గుర్తించినట్టు సమాచారం.

ఎవరీ పాల్‌?

ఆర్సీ సింగ్‌, ఎస్‌కె పాల్‌ లు జగన్‌ బినామీ కంపెనీల్లో పనిచేసే వ్యక్తులని తేలింది. బెంగళూరు నుంచి నిఘా వర్గాలు అందించిన వివరాల మేరకు వీళ్ళద్దరూ తరచూ జగన్‌ నివాసానికి వస్తుండే వారని తెలిసింది. అయితే ఈ ఇద్దరికి ఎక్కడా ఎలాంటి స్థిరాస్తులున్నట్టు లేదు. సింగ్‌ అనే వ్యక్తి జగన్‌ కంపెనీల్లో సాధారణ ఉద్యోగి ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం.  మొత్తం మీద ఈ కథ బయటకొస్తే జగన్‌ మనీ ల్యాండరింగ్‌ వ్యవహారం వెలుగుచూస్తుందని భావిస్తున్నారు. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే యోచనలో సీబీఐ  అధికారులున్నారు.


READ : http://www.mahaandhra.com/TermsandCondition.php

Back to Top